వేమన శతకాలు

అనువుగాని చోట అదికుల మనరాదు.
కొంచెముండు టెల్ల కొదవ గాదు
కొండా అద్దమందు కొంచెమై వుండదా
విశ్వదాభి రామ వినుర వేమ .

అగ్నిచేతబట్టి యా పరమేశుని
నిందచేసి నరులు నీరుకారె?
దక్షు క్రతవులోని తల్లడమెఱుగరా?
విశ్వదాభిరామ వినురవేమ.

అంతరంగమందు నపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా?
విశ్వదాభిరామ వినురవేమ.

అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ
మెలగెడు జనులెల్ల మేదినిపయి
యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము
విశ్వదాభిరామ వినురవేమ.

అధికుడైన రా జొకల్పుని జేపట్ట
వానిమాట చెల్లు వసుధలోన
గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ.

అన్నిజాడలుడిగి ఆనందకాముడై
నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ
నిన్ను నమ్మముక్తి నిక్కంబు నీయాన
విశ్వదాభిరామ వినురవేమ.

ఇనుము విఱిగెనేని యినుమాఱు ముమ్మాఱు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విఱిగినేని మఱియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ.

ఇనుము విఱిగెనేని యినుమాఱు ముమ్మాఱు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విఱిగినేని మఱియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ.

ఎంత సేవచేసి యేపాటు పడినను
రాచమూక నమ్మరాదురన్న
పాముతోడిపొందు పదివేలకైనను
విశ్వదాభిరామ వినురవేమ.

ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెఱిగి చూడు వ్రుత్తియందు
నేర్పులేనివాని నెఱయోధుడందురా?
విశ్వదాభిరామ వినురవేమ.

ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన
వాని నోరు మిత్తి వరుసగొట్టు
చేపపిండు బెద్ద చేపలు చంపును
చేపలన్ని జనుడు చంపు వేమ.

కల్ల నిజముజేసి కపటభావముజేంది
ప్రల్లదంబులాడు భక్తిలేక
మాయలాడుఖలుడు మహితాత్ముసాటియా?
విశ్వదాభిరామ వినురవేమ.

గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతున్న
గుఱ్ఱములు నడచు గుఱుతుగాను
గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ.

ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ.

ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని
తెలియబడునె యాత్మ దెలివిలేక
చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా
విశ్వదాభిరామ వినురవేమ.

కండ చక్కెఱయును గలియ బాల్పోసిన
తఱిమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గంపెట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.కలియుగంబునందు ఘనతకు నైచ్యము
ఘనత నైచ్యమునకు గలుగుచుండు
శ్రధ్ధ భక్తులుడిగి జనులుంద్రు కావున
విశ్వదాభిరామ వినురవేమ

కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులవ పదవిగొన్న దొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ.

కానివానితోడగలసి మెలంగిన
హానివచ్చు నెంతవానికైన
కాకిగూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ.

కూళ కూళ్ళుమేయు గుణమంత చెడనాడి
నెట్టివారు మెచ్చరట్టివాని
కొయ్యదూలమునకు గుదురునా ఞానంబు?
విశ్వదాభిరామ వినురవేమ.

కైపుమీఱువేళ గడకుజేరగరాదు
అనువుదప్పి మాటలాడరాదు
సమయమెఱుగనతడు సరసుండుకాడయా?
విశ్వదాభిరామ వినురవేమ.

కొండగుహలనున్న గోవెలందున్న
మెండుగాను బూది మెత్తియున్న
దుష్టబుధ్ధులకును దుర్బుధ్ధి మానునా?
విశ్వదాభిరామ వినురవేమ.

కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ.

గంగపాఱుచుండ గదలని గతితోడ
ముఱికివాగు పాఱు మ్రోతతోడ
అధికుడొర్చునట్టు లధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ.

చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ.

చంపగూడ దెట్టి జంతువునైనను
చంపవలయు లోకశత్రుగుణము
తేలుకొండిగొట్ట దేలేమిచేయురా
విశ్వదాభిరామ వినురవేమ.

ఛర్ధి పుట్టినప్డు సాపడసైపదు
నాతిగన్న యప్డు నీతి తగదు
చేటు మూడినపుడు మాటలు తోచవు
విశ్వదాభిరామ వినురవేమ.

టక్కరులను గూడి యొక్క సక్కెములాడ
నిక్కమైన ఘనుని నీతిచెడును
ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి
విశ్వదాభిరామ వినురవేమ.

డెందమందు దలచు దెప్పరమెప్పుడు
నోర్వలేనిహీను డొరునికట్టె
తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన
విశ్వదాభిరామ వినురవేమ.

తనకుగలుగు పెక్కు తప్పులటుండగా
పరులనేరుచుండు నరుడు తెలియ
డొడలెఱుంగ డనుచు నొత్తి చెప్పంగవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.

తనర న్రుపతితోడ దగ దుర్జనునితోడ
అగ్నితోడ బరుని యాలితోడ
హాస్యమాడుటెల్ల నగును ప్రాణాంతము
విశ్వదాభిరామ వినురవేమ.

తేలుకుండును తెలియగొండి విషంబు
ఫణికినుండు విషము పండ్లయందు
తెలివిలేని వాండ్ర దేహమెల్ల విషంబు
విశ్వదాభిరామ వినురవేమ.

దాసరయ్య తప్పు దండంబుతో సరి
మోసమేది తన్ను ముంచుకున్న?
నీచుడై చెడునటు నీచుల నమ్మిన
విశ్వదాభిరామ వినురవేమ.

దుండగీడు కొడుకు కొండీడు చెలికాడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును కోతియె సరియగు
విశ్వదాభిరామ వినురవేమ.

దుష్టజనులు మీఱి తుంటరిపనులను
శిష్టకార్యములుగ జేయుచుంద్రు
కూడదనెడువారి గూడ నిందింతురు
విశ్వదాభిరామ వినురవేమ.

దూరద్రుష్టిగనరు తూగిదనుకను
బారుపట్టెఱుగౌ పడినదనుక
దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు
విశ్వదాభిరామ వినురవేమ.

నేరని జనులకును నేరముల్ నేర్పుచు
చక్కచేయరిల నసాధులెపుడు
ఒప్పు దుర్జనములు తప్పగనెంతురు
విశ్వదాభిరామ వినురవేమ.

నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె
మనసు భూతమువలె మలయగాను
శివుని గాంతు ననుచు సిగ్గేలగాదురా?
విశ్వదాభిరామ వినురవేమ.

పరులు చదువజూచి నిరసనబుధ్ధితో
వట్టిమాటలాడు వదరుబోతు
అట్టి ఖలుని జాడలరయుట దోసము
విశ్వదాభిరామ వినురవేమ.

పాలు పంచదార పాపరపండ్లలో
చాలబోసి వండ జవికిరావు
కుటిలమానవులకు గుణమేల కల్గురా?
విశ్వదాభిరామ వినురవేమ.

బిడియ మింతలేక పెద్దను నేనంచు
బొంకములను బల్కు సంకఠునకు
ఎచ్చు కలుగదిచట జచ్చిన రాదట
విశ్వదాభిరామ వినురవేమ.

మాటలాడు టొకటి మనసులో నొక్కటి
ఒడలిగుణ మదొకటి నడత యొకటి
ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను
విశ్వదాభిరామ వినురవేమ.

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు బనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ వినురవేమ.

రేగుపుచ్చకాయ రేయెల్ల దన్నిన
మురగ దంతకంత పెరుగుగాని
ఒరులు ఛీయన్నను నోగు సిగ్గెఱుగునా?
విశ్వదాభిరామ వినురవేమ.

వంపుకఱ్ఱగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింపరాదు
విశ్వదాభిరామ వినురవేమ.

వాక్కు శుధ్ధిలేని వైనదండాలు
ప్రేమ కలిగినట్టు పెట్టనేల?
నొసట బత్తిజూపు నోరు తోడేలయా
విశ్వదాభిరామ వినురవేమ.

ఎంత చదువు చదివి యెన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినురవేమ.

వేము బాలుపోసి వేయేండ్లు పెంచిన
జేదు విడిచి తీపి జెందబోదు
ఓగు గుణము విడిచి యుచితఞుడగు నెట్లు?
విశ్వదాభిరామ వినురవేమ.

వేఱు పురుగుచేరి వ్రుక్షంబు జెఱుచును
చీడపురుగుచేరి చెట్టుజెఱుచు
కుచ్చితుండు చేరి గుణవంతు జెరుచురా
విశ్వదాభిరామ వినురవేమ.

సారవిద్యలందు సరణి దెలియలేక
దూరమందు జేరు దుర్జనుండు
పరముదెలియ నతడు భావఞుడెట్లగు?
విశ్వదాభిరామ వినురవేమ.

అభిజాత్యముననె యాయువున్నంతకు
దిరుగుచుండ్రు భ్రమల దెలియలేక
మురికి భాండమునను ముసరునీగలరీతి
విశ్వదాభిరామ వినురవేమ.

ఇహమునందుబుట్టి ఇంగిత మెఱుగని
జనుల నెంచి చూడ స్థావరములు
జంగమాదులనుట జగతిని పాపంబు
విశ్వదాభిరామ వినురవేమ.

ఎడ్డెదెల్పవచ్చు నేడాదికైనను
మౌనిదెల్పవచ్చు మాసముననె
మొప్పెదెల్పరాదు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ.

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన
నలుపు నలుపేకాని తెలుపు కాదు
కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ.

ఔనటంచు నొక్కడాడిన మాటకు
కాదటంచు బలుక క్షణము పట్టు
దాని నిలువదీయ దాతలు దిగివచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.

ఔర! యెంతవార లల్లరి మానవుల్
ప్రభువైన గేలిపఱతు రెన్న
దా దెగించువాడు దండియౌ భువిలోన
విశ్వదాభిరామ వినురవేమ.

కన్నులందు మదము కప్పి కానరుగాని
నిరుడు ముందటేడు నిన్న మొన్న
దగ్ధులైనవారు తమకంటె తక్కువా?
విశ్వదాభిరామ వినురవేమ.

కర్మగుణములన్ని కడబెట్టి నడువమి
దత్త్వమెట్లు తన్ను దగులుకొనును?
నూనె లేక దివ్వె నూవుల వెల్గునా?
విశ్వదాభిరామ వినురవేమ.

కసరు తినును గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్లు వినుచుజేయు బనులు
వానిసాటియైన మానవుడొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమ.

కసవును దినువాడు ఘనఫలంబుల రుచి
గానలేడుగాదె వానియట్లు
చిన్నచదువులకును మిన్నఞానమురాదు
విశ్వదాభిరామ వినురవేమ.

ఖరముపాలు తెచ్చి కాచి చక్కెఱవేయు
భక్ష్యమగునె యెన్న భ్రష్టుడట్లె
యెంత చెప్పి చివరనెసగిన బొసగునే?
విశ్వదాభిరామ వినురవేమ.

గాడ్దెమేనుమీద గంఢంబు పూసిన
బూదిలోన బడచుబొరలు మరల
మోటువాని సొగసు మోస్తరియ్యది సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.

గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన
విధముగా నెఱుగక వెఋఱిజనులు
ఞానులైనవారి గర్హింతు రూరక
విశ్వదాభిరామ వినురవేమ.

చెఱకు తీపిలేమి జెత్తనాబడునట్లు
పరగ గుణములేని పండితుండు
దూఱపడునుగాదె దోషమటుండగ
విశ్వదాభిరామ వినురవేమ.

చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువుచదివి యింకజదువు చదివి
చదువుమర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ

తగదు తగదటంచు తగువారు చెప్పిన
వినడు మొఱకు చెడును గొనకు నిజము,
మునులు చెప్పు ధర్మముల మీర్నింతెకా
విశ్వదాభిరామ వినురవేమ.

తన్నుజూచి యొరులు తగమెచ్చవలెనని
సొమ్ములెఱవుదెచ్చి నెమ్మిమీఱ
నొరులకొరకుతానె యుబ్బుచునుండును
విశ్వదాభిరామ వినురవేమ

తల్లి యున్నయపుడె తనదు గారాబము
లామె పోవ దన్ను నరయ రెవరు
మంచికాలమపుడె మర్యాద నార్జింపు
విశ్వదాభిరామ వినురవేమ

తుమ్మచెట్టు ముండ్లు తోడనేపుట్టును
విత్తులోననుండి వెడలునట్లు
మూర్ఖునకును బుధ్ధి ముందుగాబుట్టును
విశ్వదాభిరామ వినురవేమ

నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటిమాటికెల్ల మాఱును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ

పాముకన్న లేదు పాపిష్టి యగు జీవి
యట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ

పొట్లకాయ రాయి పొదుగ ద్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుగు
కుక్కతోకగట్ట గుదురునా చక్కగా?
విశ్వదాభిరామ వినురవేమ

మంచివారు లేరు మహిమీద వెదకిన
కష్టులెందఋఐన గలరు భువిని
పసిడి లేదుగాని పదడెంత లేదయా
విశ్వదాభిరామ వినురవేమ

మ్రాను దిద్దవచ్చు మఱి వంకలేకుండ
దిద్దవచ్చు రాయి తిన్నగాను
మనసు దిద్దరాదు మహిమీద నెవరికి
విశ్వదాభిరామ వినురవేమ

అంతరంగ మెఱుగ హరుడౌను గురుడౌను
అంతరంగ మెఱుగ నార్యుడగును
అంతరంగ మెఱిగి నతడెపో శివయోగి
విశ్వదాభిరామ వినురవేమ.

అనల మించుకైన గనలి మండునుగాని
చనువుగాని యొఱుక మనికి నిడదు
తనువు మఱచువాడె తత్త్వఞుడగునయా
విశ్వదాభిరామ వినురవేమ.

చదువులన్ని చదివి చాల వివేకియౌ
కపటికెన్నడైన గలదెముక్తి?
నిర్మలాత్మకునకె నిశ్చలంపు సమాధి
విశ్వదాభిరామ వినురవేమ.

జక్కి నెక్కి వీధిజక్కగా వెలువడ
గుక్క విన్నివెంట కూయదొడగు
ఘనున కోర్వలేని కాపురుషులు నిట్లె
విశ్వదాభిరామ వినురవేమ.

నేరనన్నవాడు నెఱజాణ మహిలోన
నేర్తునన్నవాడు వార్తకాడు
ఊరకున్నవాడె యుత్తమోత్తముడయా
విశ్వదాభిరామ వినురవేమ.

ఆత్మ తనలోన గమనించి యనుదినంబు
నిర్గుణాత్మార్చనముజేసి నిత్యమమ్ర
ప్రత్యగాత్మను లోనెంచి ప్రబల్యోగి
సచ్చిదానంద పదమందు సతము వేమ.

ఇంటిలోని జ్యోతి యెంతయు వెలుగగా
బొరుగువారి యగ్గి కరుగరెపుడు
తాను దైవమాయె, దైవము గొలుచునా?
విశ్వదాభిరామ వినురవేమ.

కస్తరి నటు చూడ గాంతి నల్లగ నుండు
పరిమళించు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

కలుష మానసులకు గాంపింప గారాదు
అడుసు లోన భాను డడగినట్లు
తేట నీరు పుణ్య దేహ మట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ.

మాటలాడవచ్చు మనసు దెల్పగలేడు
తెలుప వచ్చు దన్ను తెలియలేడు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమ.

ఊగియూగి లాగి యున్నది కనగోరు
సాగలాగి పట్టు సాక్షిగాను
యోగమమర ముక్తి నొందును ప్రాఞుండు.
విశ్వదాభిరామ వినురవేమ

కనగ సొమ్ము లెన్నొ కనకంబ దొక్కటి
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజ యొక్కటె సుమీ.
విశ్వదాభిరామ వినురవేమ

కల్ల గురుడు గట్టు కర్మచయంబులు
మధ్య గురుడు గట్టు మంత్రచయము
ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు.
విశ్వదాభిరామ వినురవేమ

చెఱకు తోటలోన జెత్త కుప్పుండిన
కొంచమైన దాని గుణము చెడదు
ఎఱుక గలుగు చోట నెడ్డె వాడున్నట్లు.
విశ్వదాభిరామ వినురవేమ

వెఋఱివాని మిగుల విసిగింపగా రాదు
వెఋఱివాని మాట వినగ రాదు
వెఋఱి కుక్క బట్టి వేటాడగా రాదు
విశ్వదాభిరామ వినురవేమ

అల్పబుధ్ధివాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుతినెడికుక్క చెఱకు తీపెఱుగున?
విశ్వదాభిరామ వినురవేమ.

అలమెఱుగు యోధు డల్పుని జేరిన
మార్పుచేత బుధ్ధి మరిగి తిరుగు
మ్రానుమ్రాను తిరుగు మర్కట రీతిని
విశ్వదాభిరామ వినురవేమ.

కండ చక్కెఱయును గలియ బాల్పోసిన
తఱిమి పాము తన్నుదాకుగాదె
కపటమున్నవాని గంపట్టవలె సుమీ
విశ్వదాభిరామ వినురవేమ.

కసినిగల్గి పాపకర్ముల బీడింతు
రల్ల ప్రభులు యముని యల్లభటులు
వ్రుశ్చికంబుగన్న విడుతురే చంపక
విశ్వదాభిరామ వినురవేమ.

కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మ్ర్మములను చెప్పరాదు
పేరు తీరుదెల్ప నూరెల్ల ముట్టించు
విశ్వదాభిరామ వినురవేమ.

కొండముచ్చు పెండ్లి కోతిపేరంటాలు
మొండివాని హితుడు బండవాడు
దుండగీడునకును కొండెడు దళవాయి
విశ్వదాభిరామ వినురవేమ.

కొండెగాడు చావ గొంపవాకిటికిని
వచ్చిపోదురింతె వగపులేదు
దూడ వగచునె భువిదోడేలు చచ్చిన
విశ్వదాభిరామ వినురవేమ

గాడ్దెయేమెఱుంగు గంధపువాసన
కుక్కయేమెఱుంగు గొప్పకొద్ది
అల్పుడేమెఱుంగు హరుని గొల్చు విరక్తి
విశ్వదాభిరామ వినురవేమ.

చంద్రునంతవాడె శాపంబు చేతను
కళల హైన్యమంద గలిగె గదర!
పుడమి జనులకెల్ల బుధ్ధు లిట్లుండురా.
విశ్వదాభిరామ వినురవేమ.

వాదమాడడెపుడు వరుస నెవ్వరితోడ
జేరరాడు తాను చేటుదేడు
ఞాని యగుచు బుధుడుఘనత బొందగజూచు
విశ్వదాభిరామ వినురవేమ.

వలపు గలిగెనేని వనజాక్షి యధరంబు
పంచదారకుప్ప పాలకోవ
చూత ఫలరసంబు జున్నుసమానము
విశ్వదాభిరామ వినురవేమ

వలపు తీరెనేని వనజాక్షి యధరంబు
ములక పంటి గిజరు ముష్టిరసము
చింత పోంత యగును జీడి సమానమౌ
విశ్వదాభిరామ వినురవేమ

రూపులేని వనిత రూఢి పతివ్రత
నీటు లేనివాడు పోటు బంటు
తెలుపవచ్చు నెట్లు దేవరభంటుం
విశ్వదాభిరామ వినురవేమ

మొగము జూచినపుడె మోహంబు ఘనమౌను
ధనము జూచినపుడె తగులు మనసు
కూలి నష్టమైన గొరునే కొఱగామి
విశ్వదాభిరామ వినురవేమ

పచ్చదనము చూచి ఇచ్చను కాముకుల్
చిచ్చులో బడుదురు క్షితితలమున
ఇచ్చ కలుగజేయు హెచ్చుగా మోహంబు
విశ్వదాభిరామ వినురవేమ

పంకజాక్షి గన్న బంగరు బొడగన్న
దిమ్మపట్టియుండు తెలివియొప్పు
మనుజులకును తత్త్వ మహిమెట్లు కల్గురా
విశ్వదాభిరామ వినురవేమ

చక్కెఱ కలిపి తినంగా
ముక్కిన తవుడైన లెస్స మోహము కదుర
న్వెక్కుడు బానిసయైనన్
మక్కువ గను దివ్యభామ మహిలో వేమా

కన్నెల నవలోకింపగ
జన్నులపై ద్రుష్టి పాఱు సహజం బిలలో
కన్నుల కింపగు ద్రుష్టిని
తన్నెఱుగుట ముక్తికిరవు తగునిది వేమా

ఆలు రంభయైన నతిశీలవతియైన
జారపురుషుడేల జాడమాను
మాలవాడకుక్క మఱగిన విడుచునా
విశ్వదాభిరామ వినురవేమ

వారకాంతలెల్ల వలపించి వత్తురు
బుధ్ధులెల్ల తొలగబుచ్చు కొఱకు
మాట రూఢిగాగ మగలెల్ల వత్తురు
విశ్వదాభిరామ వినురవేమ

రాజసంబు చెంది రమణుల పొందాస
పడెడువాడు గురుని ప్రాపెఱుగునె
విటుల మరుగు యువతి విభుభక్తి యెఱుగునా
విశ్వదాభిరామ వినురవేమ

పడుచు నూఱకేల బాఱచూచెదరొక్కొ
ఎంత వారలైన భ్రాంతి చెంది
లోన మీఱు కాము లొంగజేయగలేక
విశ్వదాభిరామ వినురవేమ

పడతి మోసె నొకడు పడతి మేసె నొకండు
పడతి సురము జేర్చి బ్రతికె నొకడు
పడతి కొఱకె పెక్కు పాట్లను బడిరయా
విశ్వదాభిరామ వినురవేమ

చదివి నతని కన్న చాకలియే మేలు
కులము వేల్పు కన్న కుక్క మేలు
సకల సురల కన్న జారభామిని మేలు
విశ్వదాభిరామ వినురవేమ.

జంత్ర మంత్ర మహిమ జాతవేదుడెఱుంగు
మంత్రవాది యెఱుగు దంత్ర మహిమ
తంత్రిణీక మహిమ దినువాడెఱుంగును
విశ్వదాభిరామ వినురవేమ.

తగిన కులజుడైన తన యెత్తు ధనమైన
పరపురుషుని నేల పట్ట వచ్చు?
పరమ సాధ్వి చూడ నొరుల నంటదు సుమా
విశ్వదాభిరామ వినురవేమ.

ఝషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీట నుండె నేని నిక్కి పడును
అండ తలగు నెడల నందఱి పని యట్లె
విశ్వదాభిరామ వినురవేమ.

ఝషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీట నుండె నేని నిక్కి పడును
అండ తలగు నెడల నందఱి పని యట్లె
విశ్వదాభిరామ వినురవేమ.

ఝషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీట నుండె నేని నిక్కి పడును
అండ తలగు నెడల నందఱి పని యట్లె
విశ్వదాభిరామ వినురవేమ.

జన్మములను మఱియు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలము కాన
రాక యుండు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినురవేమ.

డీకొనంగ దగదు డెంద మెఱుంగక
యడుగ వచ్చి కొంత యనిన వాని
చెప్పునంత నినియు మెప్పుగా బలుకుమీ
విశ్వదాభిరామ వినురవేమ.

తగవు తీర్చువేళ ధర్మంబు దప్పిన
మానవుండు ముక్తి మానియుండు
ధర్మమునె పలికిన దైవంబు తోడగు
విశ్వదాభిరామ వినురవేమ